వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ రసవత్తరంగా మారనుంది.  ఆ స్థానం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ మొదలైంది. ఆ పార్లమెంట్ స్థానం నుంచి తానే టీడీపీ అభ్యర్థిని అంటూ.. సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. 

సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ 2009లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఆ ఐదేళ్లు ఖాళీగా ఉండకుండా.. ఆయన ప్రజలకు సేవ చేశారు. దాంతో 2014 ఎన్నికల్లో మురళీమోహన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా ఈ అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే.. ఆయనపై కొంత నెగిటివిటీ ఉందనే ప్రచారం ఇప్పుడిప్పుడే మొదలైంది.

ఇదిలా ఉండగా.. మురళీ మోహన్ కి పోటీగా.. వైసీపీ నుంచి ఓ సినీ నటుడిని రంగంలోకి దింపాలని జగన్ ప్లాన్ చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, సినీ నటుడు మార్గాని భరత్( ఓయ్ నిన్నే సినిమా హీరో)ని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక జనసేన నుంచి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ ని వీడి జనసేన తరపున ఎంపీగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.