విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను సినీనటుడు ఆలీ కలిశారు. జగన్ తో సుమారు గంటసేపు అలీ వ్యక్తిగతంగా మాట్లాడారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై ఆలీ ప్రశంసలు కురిపించారు. 

నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని ఆలీ అభిప్రాయపడ్డారు. అలాగే పాదయాత్రలో పార్టీకి వస్తున్న మైలేజ్ పై కూడా ఇరువురు చర్చించుకున్నారు.

అలాగే ఆలీ జగన్ ఆరోగ్య సమస్యలు, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై కూడా చర్చించుకున్నారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆరోగ్య పరంగా  జాగ్రత్తలు తీసుకోవాలని ఆలీ సూచించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారని ప్రచారం. 

ఇకపోతే వైఎస్ జగన్ కు సినీ రంగం నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితం సినీనటుడు భానుచందర్, కృష్ణుడులు వైఎస్ జగన్ ను పాదయాత్రలో కలిశారు. ఇరువురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో సైతం కృష్ణుడు పాల్గొన్నారు.