విజయవాడ : డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట శివ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో నాలుగు చోట్ల అధికారులు సోదాలు జరిపారు. వారి తనిఖీల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

శివ సత్యనారాయణ భార్య, కుమారుడి పేరు మీద మూడు భవనాలు, హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌, కారు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ డీవీవీ ప్రతాప్‌ నారాయణ తెలిపారు. అలాగే కృష్ణాజిల్లా కంచికచర్ల, జక్కంపూడిలో 800 గజాల స్థలం, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 ఎకరాలు భూమితో పాటు బ్యాంక్‌లో రూ.50 లక్షలు నగదు, రూ.15 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా రెండు బ్యాంకుల్లో లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.  

1989 జనవరి 11న వరప్రసాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, 2018న డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది.