భారీగా అక్రమాస్తుల ఆరోపణలు... ఏపీ సోషల్ వెల్ఫేర్ ఉన్నతాధికారిపై ఏసిబి దాడి...(వీడియో)
ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జాయింట్ సెక్రటరీ కెడివిఎం. ప్రసాద బాబు ఇంట్లో ఏసిబి అధికారులు దాడులు చేపట్టారు

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అవినీతి నిరోధక విభాగం (ఏసిబి) అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ప్రభుత్వాధికారులపై వరుసగా దాడులు చేస్తున్నారు. తాజాగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జాయింట్ సెక్రటరీ కెడివిఎం. ప్రసాద బాబు ఇంట్లో దాడులు చేపట్టారు. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసిబి అధికారులు ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.
ప్రసాద్ బాబు పోలీస్ కానిస్టేబుల్ స్థాయి నుండి ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి వరకు పనిచేసారు. 1991లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఐటిబిపి కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని పొందిన ఆయన హైదరాబాద్ లో పనిచేసారు. ఆ తర్వాత ఎస్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా చేరి పదోన్నతిపై ఎస్సై, సీఐగా పనిచేసారు. ఇక 2007లో ఆనాటి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షరాసి ఉన్నత ఉద్యోగాన్ని పొందారు. గ్రూప్-1 అధికారిగా ట్రెజరీస్ మరియు అకౌంట్స్ విభాగంలో ఏటివో గా చేరారు.
భువనగిరి జిల్లాలో ఏటివో గా పనిచేసిన ప్రసాద్ బాబు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లాలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా,విజయవాడ డివిజనల్ ట్రెజరీ అధికారిగా పనిచేసారు. అనంతరం డఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. ప్రస్తుతం ప్రసాద్ బాబు ఏపీ సోషల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్నారు.
వీడియో
కెడివైఎం. ప్రసాద్ బాబు అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు అందడంలో తాజాగా ఏసిబి దాడులకు దిగింది. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసిబి అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాడని ఏసిబి నిర్దారించుకుని చర్యలకు సిద్దమైనట్లు సమాచారం. ఈ ఏసిబి దాడుల్లో పట్టుబడిన ఆస్తులు, ఇతర వివరాలు తెలియాల్సి వుంది.