పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఓ కీచకుడి కథ వెలుగులోకి వచ్చింది. పలువురు యువతులు, మహిళలను మోసం చూసి వారిని అశ్లీల వీడియోలను తీశాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు సెల్‌ఫోన్లను మరమ్మత్తులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు.

ఈ క్రమంలో తన షాప్‌కు వచ్చే యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి వారిని లోబరచుకున్నాడు. అనంతరం వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియో తీశాడు.

అయితే ఇతని వద్ద ఫోన్లు మరమ్మత్తు పనులు నేర్చుకునేందుకు చేరిన మరో యువకుడు సదరు అశ్లీల వీడియోలను గమనించి చోరీ చేసి గ్రామంలోని తన మిత్రులకు వాట్సాప్ ద్వారా పంపాడు.

ఈ సమాచారం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆ వీడియోలన్నీ సేకరించి యువకుడిని బ్లాక్‌మెయిల్ చేశాడు. బేరం కుదరకపోవడంతో కొన్ని అశ్లీల వీడియోలను పలు వాట్సాప్ గ్రూపుల్లో ఉంచినట్లుగా తెలుస్తోంది.

దీంతో బాధితుల్లో ఒకరైన యువతి మొగల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధ్యుడైన వ్యక్తితో పాటు డేటా చోరీకి పాల్పడిన మరో యువకుడిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన వ్యక్తికి పలువురు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో పోలీసులు అతనిని వదిలివేసినట్లుగా తెలుస్తోంది.