ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు ఆయనను సస్పెన్షన్‌లోనే ఉంచుతున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఆయన సస్పెన్షన్ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

కాగా, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది.

పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇంజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేశారని వెల్లడించింది. అదే సంస్థకు తన కుమారుడు ఇండియా ప్రతినిథిగా ఉన్న సంగతిని దాచి పెట్టారని ఆరోపించింది.

ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీవీపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి.

ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది.

రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది. ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.