Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ షోకాజ్ నోటీసులకు... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఎబివి

ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై వివరణ ఇవ్వాల్సిందిగా జారీచేసిన షోకాజ్ నోటీసులపై ఐపిఎస్ ఎబి వెంకటేశ్వర్ రావు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 

AB Venkateshwar rao strong reply to ap government show cause notice
Author
Amaravati, First Published Apr 6, 2022, 12:24 PM IST

అమరావతి: ఆలిండియా సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్ రావు (AB Venkateshwar Rao)కు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే మీడియాతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా మాజి ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఏపీ ప్రభుత్వ కార్యదర్శి సమీర్ శర్మ నోటీసులు జారీ చేసారు. ఇలా పెగాసస్ వివాదంపై తన మీడియా సమావేశం వివాదాస్పదంగా మారి షోకాజ్ నోటీసుల వరకు వెళ్లడంతో ఎబి వెంకటేశ్వరావు స్పందిచారు. మీడియా సమావేశం నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన నోటీసుకు గట్టి రిప్లై ఇచ్చారు. 

వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని ఎబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు ఎబివి తెలిపారు.

తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని వివరణ లేఖలో ఎబివి పేర్కొన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనం గా ఉండాలి... తాను కూడా అదే చేసానని ఎబివి వెల్లడించారు.   

''ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయి...  మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు. గౌరవానికి భంగం కలిగించేలా నాపైనే కాదు నా కుటుంబసభ్యులపైనా అధికార వైసిపి నాయకులు ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటాను. రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాథమిక హక్కుల మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చాను. మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపాను'' అని ఎబివి వెల్లడించారు. 

''రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా ఉంటానని ఐపిఎస్ శిక్షణ సమయంలో చేసిన ప్రమాణం గుర్తుందా ఏబీ వెంకటేశ్వర్రావు గారూ? ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీరు ప్రజల కోసం చేసిన సేవ ఏమైనా ఉందా?'' అంటూ వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి తనపై చేసిన ట్వీట్ ను కూడా వివరణలో పేర్కొన్నారు ఎబి వెంకటేశ్వరరావు.

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి అధికారంలో వుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. దీంతో అధికార వైసిపి ప్రతిపక్ష టిడిపి, చంద్రబాబుపైనే కాదు ఆ సమయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఎబి వెంకటేశ్వర రావుపై విమర్శలు గుప్పించారు. దీంతో ఎబివి మీడియా సమావేశం ఏర్పాటుచేసి తనకు తెలిసినంతవరకు ఎలాంటి తప్పు జరగలేదని వివరించారు. 

హైద్రాబాద్ లో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎబివి మీడియాతో మాట్లాడుతూ... పెగాసస్ స్పై వేర్ ను 2019 మే వరకు ఉపయోగించలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న తనకు ఈ విషయాలు తెలుసునన్నారు. పెగాసెస్ సహా ఎలాంటి సాఫ్ట్ వేర్ లు ఉపయోగించలేదన్నారు.

అయితే  ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దంగా ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారని అదే రోజున వైసీపీ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేశారు. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఏబీ వెంకటేశ్వరరావుకు లేఖ రాశారు. మీడియాతో మాట్లాడిన విషయమై వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకొంటామని ఆ లేఖలో చీఫ్ సెక్రటరీ హెచ్చరించారు. ఈ నోటీసులకు ఎబివి కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios