వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి ఆరోపించారు. రఘురామ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిందని... మధ్యాహ్నం ఎంపీ కుటుంబసభ్యులు ఆయనకు భోజనం తీసుకొచ్చారని ఏఏజీ తెలిపారు.

అప్పటి వరకు రఘురామ మామూలుగానే వున్నారని.. హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ కాగానే ఎంపీ కొత్త నాటకానికి తెరలేపని పొన్నవోలు ఆరోపించారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని ఏఏజీ మండిపడ్డారు. రఘురామ ఆరోపణలపై న్యాయస్థానం మెడికల్ కమిటీ వేసిందని ఆయన వెల్లడించారు. రేపు మధ్యాహ్నం లోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని సుధాకర్ రెడ్డి చెప్పారు. 

మరోవైపు ఏపీ హైకోర్టు సీఐడీ పోలీసుల తీరును మండిపడింది. రఘురామకృష్ణంరాజు శరీరంపై నిన్న లేని దెబ్బలు ఈ రోజు ఎలా వచ్చాయని ప్రశ్నించింది. గాయాలు తాజాగా తగిలినవని తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు హెచ్చరించింది.

రఘురామకృష్ణంరాజు కాళ్లపై గాయాల చిత్రాలు, దృశ్యాలను ధర్మాసనానికి ఎంపీ తరఫు న్యాయవాదులు చూపించారు. రిమాండ్‌ రిపోర్టును రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై డివిజన్‌ బెంచ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఇదే సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? ఎంపీ రఘురామకు తగిలిన గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేయాలి అని కోర్ట్ ఆదేశించింది. 

Also Read:రఘురామ కాలికి గాయాలు: మీ వల్లేనని తేలితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, సీఐడీపై హైకోర్టు ఆగ్రహం

అంతకుముందు ఎంపీ రిమాండ్ రిపోర్ట్‌ సరిగా లేకపోవడంతో సీఐడీ న్యాయస్థానం మెజిస్ట్రేట్ దానిని తిప్పిపంపారు. ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఆయన కాళ్లకు గాయాలు కనిపించాయి.

విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన ఆరోపించారు.