ఓ మహిళ అస్థిపంజరం చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఆ అస్థిపంజరం ఎక్కువ రోజులుగా వేలాడుతూ ఉండటం వల్ల జంతువులు దానిని లాక్కెళ్లాయి. ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (andhra pradesh) రాష్ట్రం చిత్తూరు (Chittoor) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దాదాపు 50 రోజులుగా ఓ మ‌హిళ అస్థిపంజ‌రం చెట్టుకు వేలాడింది. అది అట‌వీ ప్రాంతం కావ‌డంతో పెద్ద‌గా జ‌న‌సంచారం ఉండ‌దు. అయితే ఆ అస్థిపంజ‌రంలోని కొంత భాగాన్ని జంతువులు లాక్కెళ్లాయి. ఆ అటవీ ప్రాంతంలోని ప‌లు చోట్ల వాటిని వ‌దిలిపెట్టాయి. ఈ అస్థిపంజ‌రం స్థానికుల‌కు క‌నిపించింది. ఈ ఘ‌ట‌న చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లో క‌ల‌క‌లం సృష్టించింది.

చిత్తూరు (Chittoor) జిల్లాలో డీవీఆర్ కండ్రిగ (DVR Kandriga) అనే గ్రామం ఉంది. ఆ గ్రామ శివారులోని అట‌వీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ఓ మ‌హిళ అస్థి పంజ‌రంలోని కొంత భాగం, పుర్రె వేలాడుతూ స్థానికుల‌కు క‌నిపించింది. అట‌వీ ప్రాంతంలో మేక‌లు మేపేందుకు వ‌చ్చిన వారికి ఆదివారం ఈ దృశ్యం క‌నిపించింది. జంతువులు కొంత అస్తిపంజరాన్ని లాక్కెల్లి చుట్టుప‌క్క‌ల వ‌దిలేశాయి. వీటిని గ‌మ‌నించిన మేక‌ల కాపరులు భ‌య‌ప‌డి గ్రామంలోకి ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

ఈ ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. మ‌హిళ చ‌నిపోయి దాదాపు 50 నుంచి 60 రోజులు అయి ఉంటుంద‌ని ప్రాథ‌మిక నిర్ధార‌ణ కు వ‌చ్చారు. ఘ‌ట‌నా స్థ‌లంలో వారికి చెట్టుకు వేలాడుతున్న చీర‌, పుర్రె క‌నిపించాయి. ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతంలో ఎముక‌లు, ఆమె ధ‌రించిన పూసల దండ వంటివి క‌నిపించాయి. వాటిని సేక‌రించి పోస్టుమార్టం కోసం పంపించారు. కేవ‌లం ఎముక‌లు మాత్ర‌మే ల‌భించ‌డంతో మ‌హిళ వ‌య‌స్సు ఎంత ఉంటుందో పోలీసులు నిర్ధార‌ణ‌కు రాలేక‌పోతున్నారు. అయితే ఆ మ‌హిళ సూసైడ్ చేసుకున్నారా ? లేక ఆమెను ఎవరైనా చంపేసి అట‌వీ ప్రాంతంలోకి తీసుకొచ్చి వేలాడ‌దీశారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు.