పదేళ్ల కల నెరవేరింది.. తమ్ముడి ప్రమాణ స్వీకారం చూసి నాగబాబు ఆనందం
పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ శపథాలు నెరవేర్చుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు, పదేళ్ల ఎదురుచూపులు, పోరాటం తర్వాత పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ విజయం వెనుక తెలుగుదేశం, జనసేన శ్రేణులతో పాటు వారి కుటుంబ సభ్యులు శ్రమ, తోడ్పాటు ఎంతో ఉంది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో నారా, నందమూరి, కొణిదెల కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు.
ఇక, పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం జనసేన కార్యకర్తలతో పాటు మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు బాగా కష్టపడ్డారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు చాలా కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రమంతా తిరగడంతో పాటు ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ నటులతో ప్రచారం చేయించారు. ఇలా పవన్ కల్యాణ్ గెలుపు కోసం జనసేన నాయకుడిగా, పవన్ కల్యాణ్ అన్నగా ఎంతో కష్టపడ్డారు నాగబాబు.
శుక్రవారం అసెంబ్లీలోకి తొలిసారి అడుగుపెట్టిన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ తో పాటు అసెంబ్లీకి వెళ్లి.. ఆయన ప్రమాణ స్వీకారాన్ని దగ్గర నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ పూరితమైన పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలనేది తన పదేళ్ల కల అని తెలిపారు.
‘‘పదేళ్ల కల నెరవేరింది, ప్రజా ప్రస్థానం మొదలైంది:
డిప్యూటీ C.M హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది,
తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,
పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల..
అసెంబ్లీ కి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill..
మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాల చాల సంతోషంగా & గర్వాంగా ఉన్నారు..
ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో,నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధి తో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను...’’ అని నాగబాబు ట్వీట్ చేశారు.