కాటుక డబ్బా మూత గొంతులో పడి ఊపిరాడక ఏడాది చిన్నారి మరణించిన  హృదయవిదారక ఘటన ఇచ్చాపురంలో కలకలం రేపింది. కవిటి మండలం కుంకిలిపుట్టుగ గ్రామానికి చెందిన కుమార్, గీతాదొళాయిలకు పెళ్లైన రెండేళ్లకు గత యేడాది మగబిడ్డ పుట్టాడు. లియన్న దొలాయ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. భర్త కుమార్ బిలాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. 

ప్రసవానికి తల్లిగారి ఊరు రత్తకన్న వెళ్లిన గీతా దొళాయి అక్కడే ఉంది. ఈ నెల 10న బాబు పుట్టినరోజు కాబట్టి  కవిటిలోని అత్తగారి ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ప్రయాణ హడావుడిలో బాబు కాటుక డబ్బా తీసిన సంగతి గమనించలేదు.

ఆడుకుంటున్న బాబు కాటుక డబ్బా మూతను నోట్లో పెట్టుకున్నాడు. అది గొంతులోకి జారి చిక్కకుపోయింది. దీంతో బాబు స్పృహతప్పిపోయాడు. బాలుడ్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడినుండి ఇచ్చాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఇచ్చాపురం వెళ్లేసరికే బాబు చనిపోయినట్లు వైద్యులు తేల్చేశారు. దీంతో కుటుంబసభ్యలు రోదనలు మిన్నంటాయి. కుటుంబంతో పాటు గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది.