ఈ ఏడాది జనవరి 10వ తేదీన విజయనగరం జిల్లా తెర్లాం మండల పరిధిలోని రాజయ్యపేట గ్రామంలో ఓ వృద్ధురాలు ఉంటున్న ఇళ్లు కాలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో ఆమె చనిపోయింది. అయితే అగ్ని ప్రమాదం వల్ల ఆ వృద్ధురాలు చనిపోలేదని, హత్యకు గురయ్యిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. 

విజయనగరం జిల్లా తెర్లాం మండల పరిధిలోని రాజయ్యపేట గ్రామంలో గాడి గౌర‌మ్మ అనే వృద్ధురాలు నివ‌సించేది. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రి 10వ తేదీన ఆమె నివ‌సిస్తున్న ఇళ్లు కాలిపోయింది. ఇందులో ఉన్న వృద్ధురాలు కూడా స‌జీవంగా ద‌హ‌నం అయ్యింది. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంద‌రూ భావించారు. అయితే ఈ కేసులో ఇప్పుడో ట్విస్ట్ చోటుచేసుకుంది. గౌర‌మ్మ చ‌నిపోవ‌డానికి షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణం కాద‌ని తేలింది. వృద్ధురాలి మృతి ప్ర‌మాదం కాద‌ని, అది హ‌త్య‌ని పోలీసులు తెలిపారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించేందుకు మంగ‌ళ‌వారం తెర్లాం పోలీసు స్టేష‌న్ లో పోలీసులు మీడియా స‌మావేశం నిర్వహించారు. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాజయ్యపేట గ్రామానికి చెందిన గాడి గౌరమ్మ చేతబడి చేస్తుందని అదే గ్రామానికి చెందిన రెడ్డి సింహాచలం అనుమానించారు. నాలుగేళ్ల కిందట తన భార్య, పిల్లలకు ఆ వృద్ధురాలు చేత‌బ‌డి చేసింద‌ని, అందుకే వారు అనారోగ్యం పాల‌య్యార‌ని ఆయ‌నకు అనుమానం ఉంది. కాగా గ‌తేడాది అక్టోబ‌ర్ లో ఆయ‌న తండ్రి కూడా మ‌ర‌ణించారు. దీంతో అత‌డికి గౌర‌మ్మ‌పై మ‌రింత అనుమానం ఎక్కువైంది. దీంతో వృద్ధురాలు గౌర‌మ్మ‌ను హత్య చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 

హ‌త్య చేయ‌డానికి ఒక రోజు ముందు నిందితుడు వేరే వ్య‌క్తి ద‌గ్గ‌ర ప‌ని ఉంద‌ని గొడ్డ‌లి సేక‌రించాడు. జ‌న‌వ‌రి 10వ తేదీన రాత్రి వృద్ధురాలు గౌర‌మ్మ ఇంట్లో నివ‌సిస్తున్న క్ర‌మంలో అక్క‌డికి చేరుకున్నాడు. ప‌డుకున్న గౌర‌మ్మ‌ను హ‌త్య చేశాడు. అనంత‌రం త‌న వెంట ముందే తెచ్చుకున్న పెట్రోల్ పోసి మంట పెట్టాడు. దీంతో ఆమె శ‌రీరం కాలిపోయింది. ఈ ఘ‌ట‌న వ‌ల్ల ప‌క్క‌నే ఉన్న మ‌రో రెండు ఇళ్లు కూడా కాలిపోయాయి. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ తానే గౌర‌మ్మ‌ను హ‌త్య చేసి, నిప్పు పెట్టాన‌ని నిందితుడు ఒప్పుకోవ‌డంతో పోలీసులు కేసు బుక్ చేశారు. 

ఎలా వెలుగులోకి వ‌చ్చిందంటే ?
మార్చి 13వ తేదీన రాత్రి రాజ‌య్య‌పేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన పాతిన‌వ‌ల‌స క‌న‌క‌రాజు అనే వ్య‌క్తికి చెందిన ప‌శువుల కొట్టంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీంతో అది కాలిపోయింది. అయితే ఈ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న క‌న‌క‌రాజు ఆ కొట్టంలో ఉన్న ప‌శువుల తాడు విప్పి రక్షించేందుకు వెళ్లాడు. అయితే స‌మ‌యంలో ఆయ‌న‌కు రెడ్డి సింహాచ‌లం ఎదుర‌య్యాడు. ఈ అగ్ని ప్ర‌మాదానికి కార‌ణం ఆయ‌నే అని క‌న‌క‌రాజు అనుమానించాడు. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌జేశాడు. దీంతో సీఐ శోభ‌న్ బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడుతో కూడాని పోలీసు బృందం ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించింది. క‌న‌క‌రాజు అనుమానం వ్య‌క్తం చేసిన సింహాచ‌లాన్ని పోలీసు స్టేష‌న్ కు తీసుకెళ్లి విచార‌ణ ప్రారంభించారు. ప‌శువుల కొట్టాన్ని కాల్చ‌డానికి కార‌ణాలేంట‌ని అత‌డిని ప్ర‌శ్నించారు. దీంతో తాను ప‌శువుల కొట్టాన్ని కాల్చ‌లేద‌ని చెప్పాడు. కానీ జ‌న‌వరి 10వ తేదీన గౌర‌మ్మ‌ను గొడ్డ‌లితో న‌రికి హ‌త్య చేశాన‌ని, త‌రువాత నిప్పుపెట్టి కాల్చివేశాన‌ని ఆయ‌న ఒప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని సీఐ, ఎస్ ఐలు మీడియా స‌మావేశంలో తెలియ‌జేశారు. నిందితుడిపై కేసు న‌మోదు చేసి, బొబ్బిలి కోర్టులో హాజ‌రుప‌ర్చామ‌ని చెప్పారు.