కొద్దిసేపు మాట్లాడకుండా ఉండటమంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం. ఎంతగా ఓర్పు పట్టినప్పటికీ మాటలు దాచుకోవడం కష్టం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 24 ఏళ్లుగా మౌనదీక్ష చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండం పెద్దిరెడ్డి పాలెంకు చెందిన కశిందుల పూర్ణచందర్‌రావుకు భార్య, నలుగురు  పిల్లలు సంతానం. ఆయన పదో తరగతి వరకు చదువుకున్నాడు.

అయితే చదువుకునేటప్పుడు పూర్ణచందర్‌రావుకు సూర్యప్రకాశ్ అనే వ్యక్తి సీనియర్. ఈయన తర్వాతి కాలంలో సూర్యప్రకాశనంద సరస్వతిగా మారి మౌనదీక్ష చేపట్టాడు. అలా ప్రకాశం జిల్లా బొగ్గుల కొండ ప్రాంతంలో మౌనస్వామిగా ప్రసిద్ధి పొందారు.

దీంతో పూర్ణచందర్‌రావు కొంతకాలం సూర్యప్రకాశ నంద సరస్వతి శిష్య బృందంలో చేరారు. ఈ క్రమంలోనే స్వామిజీ సూచనల మేరకు తనని తాను తెలుసుకోవడం కోసం మనసుని నిలకడగా ఉంచేందుకు మౌనదీక్ష చేపట్టాడు.

మౌనవ్రతం ద్వారా ఆత్మసిద్ధిని సాధించడం కోసం 1996 నుంచి 24 ఏళ్లుగా మౌనదీక్ష చేస్తున్నాడు. నాటి నుంచి తన అవసరాలకు ఇతరులకు అర్థమయ్యే విధంగా సైగలతో చెబుతాడు. అర్థంకానీ పక్షంలో ఎదుటి వారికి పేపరు  మీద రాసి చెప్పేవారు.

తన దీక్షలో భాగంగా సూర్యప్రకాశనంద సరస్వతి స్వామిజీని నిత్యం పూజిస్తూ ఉంటాడు. కాగా గ్రామంలో శివాలయాన్ని నిర్మించేందుకు పూర్ణచందర్‌రావు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా ఆలయ నిర్మాణానికి 50 సెంట్ల భూమితో పాటు రూ.5 లక్షల నగదును విరాళంగా ఇచ్చాడని గ్రామస్తులు చెబుతున్నారు.

మౌనదీక్ష చేపట్టిన తర్వాత క్రమశిక్షణ, పట్టుదల, సాధనతో పూర్తిగా అలవాటయ్యింది. చిన్ననాటి నుంచి స్నేహితులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల సహకారంతోనే మౌనవ్రతం చేయగలుగుతున్నానని పూర్ణచందర్‌రావు తెలిపారు.