ఏడాదిలో 90 శాతం హామీలు నెరవేర్చాం: ఏపీ సీఎం వైఎస్ జగన్
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మొదటి ఏడాదిలోనే 90 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు.
అమరావతి:ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మొదటి ఏడాదిలోనే 90 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు.
ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు ఏడాది పాటు చేపట్టిన పాలనపై సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మన పాలన- మీ సూచన పేరుతో మేథో మధన సదస్సులను సీఎం సోమవారం నాడు ప్రారంభించారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు.
ఎన్నికలకు ముందు 14 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూశానని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఇంటికే సంక్షేమ ఫలాలను తీసుకొస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
చివరి లబ్దిదారుడి వరకు అందరికీ న్యాయం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టుగా సీఎం చెప్పారు.
also read:సాఫ్ట్‌వేర్ మార్చి శ్రీశైలం దేవాలయంలో కోట్లు స్వాహా: ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఈవో
ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమించామన్నారు. ప్రజలంతా సంతృప్తి చెందే స్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని జగన్ చెప్పారు.
గతంలో లంచమిస్తేనే పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది, కానీ తమ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
ఏడాది పాటు వివక్షలేని పాలన అందించాలని గట్టిగా నమ్మాను. ఆ దిశగా ప్రయత్నిస్తున్నానని సీఎం చెప్పారు. వనసా వాచా కర్మణా నీతివంతంగా పాలన అందించడమే తన ధ్యేయమన్నారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 24 శాతం తగ్గాయన్నారు. మద్యం నియంత్రించేందుకు ధరలను భారీగా పెంచామన్నారు. మద్యాన్ని దశలవారీగా నిషేధించే ప్రయత్నం చేస్తామన్నారు.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ జనతా బజార్లను ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం తెలిపారు.
ఏడాదిలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. మరో వైపు గత ప్రభుత్వ హయంలో ఉన్న పథకాలు, తమ ప్రభుత్వ హయంలో చేపట్టిన పథకాలకు సంబంధించిన వ్యత్యాసాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.