అమరావతి: తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శాసనసభలో చేసిన ప్రకటన నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటన కలకలం రేపుతోంది. 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా రెండు నెలల నుంచి తమతో టచ్‌లో ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. జగన్‌ సరే అంటే సాయంత్రమే కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారని ఆయన అన్నారు. అయితే వారంతా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ అడుగుతున్నారని చెప్పారు. 

నియోజకవర్గాల్లో పనులు చేయాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు. తనతో టచ్‌లో ఉన్నవారిలో ఒకరు నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యే అని, తాను వాళ్ల పేర్లు బయటపెట్టబోనని అన్నారు. క్షేత్రస్థాయిలో పలువురు మంది టీడీపీ నేతలు వైసీపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని వివరించారు. 

తమ పార్టీలోకి వచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. టీడీపీకి భవిష్యత్‌ లేదని వారంతా విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు.