తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లాస్ పీకారు. గడప గడపకూ కార్యక్రమాన్ని ఎవరెవరు ఎలా చేశారన్న దానిపై ఆయన చిట్టా విప్పారు. 

గడప గడపకూ మన ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమంపై సమీక్షలో ఎమ్మెల్యేలకు షాకిచ్చారు జగన్ (ys jagan) . ఎమ్మెల్యేల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన జగన్ .. ఎవరెవరు ఎన్ని రోజులు, ఎన్ని ఇళ్లకు వెళ్లారో రిపోర్ట్ బయటపెట్టారు. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు కనీసం ఒక్క ఇంటికీ కూడా వెళ్లలేదని జగన్ చెప్పారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఇళ్లకు వెళ్లకుండా ప్రతినిధులతో కార్యక్రమాన్ని నడిపించినట్లు తెలిపారు. అందరూ స్వయంగా గడప గడపకూ వెళ్లాలని జగన్ ఆదేశించారు. 

ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. పనితీరును మెరుగు పరచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని మరోసారి హెచ్చరించారు. చీఫ్ విప్ ప్రసాదరాజు అందరికంటే మంచి పనితీరు కనబరిచినట్లు ఈ సమావేశంలో చెప్పారు. 90 శాతానికి పైగా హామీలను అమలు చేశామని.. వంద శాతం చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. చేయలేకపోవడం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ALso Read:175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే టార్గెట్: గడప గడపకు ప్రభుత్వంపై వర్క్‌షాప్‌లో జగన్ దిశా నిర్ధేశం

కాగా.. బుధవారం నాడు Tadepalli లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ లో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా ఈ కార్యక్రమం జరిగిందనే విషయమై చెప్పిన ఆయన.. ఏ ప్రజా ప్రతినిధి పనితీరు ఎలా ఉంది, ఏ విషయంలో మెరుగు పడాలనే విషయాలపై దిశా నిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 8 మాసాలు జరుగుతుందని చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తీరాలని జగన్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఈ దిశగా కష్టపడాలని సూచించారు. 175 అసెంబ్లీ స్థానాలు సాధించడమే మన లక్ష్యమన్నారు. ఇది కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నామా అని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించవచ్చన్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గపడకు కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు.