విశాఖ యారాడ బీచ్‌లోని సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకమాసం, ఆదివారం కావడంతో విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం యారాడ బీచ్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

హెచ్‌బీ కాలనీకి చెందిన కొందరు యువకులు యారాడకు వచ్చారు. మధ్నాహ్నం వరకు బీచ్ పరిసరాల్లో సరదాగా గడిపి.. భోజనాలు పూర్తయ్యాక.. 2.30 గంటల ప్రాంతంలో 12 మంది సముద్రంలో స్నానానికి దిగారు.

ఈ క్రమంలో ఓ పెద్ద అల స్నేహితులను లోపలికి లాక్కుపోయింది. అక్కడే ఉన్న కొందరు మత్స్యకారులు వీరిలో ఆరుగురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చగా.. మిగిలిన ఆరుగురి జాడ తెలియరాలేదు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్, నేవీ బృందాలు ఓ హెలికాఫ్టర్, మూడ బోట్ల సాయంతో గాలింపు చేపట్టాయి.

తమ బిడ్డల ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు సముద్రం ఒడ్డునే ఎదురు చూస్తున్నారు. గల్లంతైన వారిని దేవర వాసు, నక్క గణేశ్, రాజేశ్, పేరిడి తిరుపతి, దుర్గ, కోన శ్రీనివాస్‌గా గుర్తించారు.