రెండు వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ రోడ్డు ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. మరో రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం ఏడీబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందగా..లారీలో, కారులో ఇరుక్కున్న క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తాళ్ళరేవు మండలం పెద్దవలస  నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ప్రకాశం జిల్లా అద్దంకి శివారు గరటయ్య కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా...మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.