ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన తరగతుల(బీసీ) కులాలకు ఏపీ సీఎం జగన్ దసరా కానుక అందజేశారు. బీసీ కులాలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

139 వెనకబడ్డ కులాలకు బీసీ సంక్షేమ శాఖ కొత్తగా 56 కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. ఈ నెల 18న జగన్ సర్కారు బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా బీసీల్లోని లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు సహకరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లో 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.