వైసిపికి కౌంట్ డౌన్ షురూ... 50-60 ఎమ్మెల్యేలు బయటకురావడం పక్కా..: గంటా శ్రీనివాసరావు

వైసిపి 175 సీట్లు గెలవడం కాదు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో గెలవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని గంటా పేర్కొన్నారు. 

50 to 60 MLAs ready to resign YCP : TDP Leader Ganta Srinivas Rao AKP

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి లు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటలయుద్దం మరింత ఎక్కువయ్యింది. ఈ క్రమంలోనే టిడిపి మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసిపి ఎమ్మెల్యేల రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైసిపిని వీడారని... రాబోయే రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నాయని అన్నారు. 50 నుండి 60 మంది ఎమ్మెల్యేలు వైసిపి నుండి బయటకు వస్తారని అన్నారు.  వైసిపి పరిస్థితి మునిగిపోతున్న పడవలా వుందని మాజీ మంత్రి గంటా అన్నారు. 

వైసిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది... మరో 70 రోజుల్లో దిగిపోవడం ఖాయమని అన్నారు. ఉత్తరాంధ్రలో అన్నిసీట్లు తామే గెలుస్తామని వైసిపి నాయకుల మాటలను గంటా గుర్తుచేసుకున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీల్లో కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలను వైసిపి గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేసారు. రాష్ట్రంలోని 175 సీట్లను గెలవడం కాదు...  1 లేదా 7  లేదా 5 సీట్లను మాత్రమే వైసిపి గెలుచుకుంటుందని గంటా పేర్కొన్నారు.  

ఎన్నికల వేళ 'సిద్దం' పేరిట అవాస్తవాలు చెప్పే కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని గంటా అన్నారు. గత ఎన్నికల సమయంలో 730 హామీలిచ్చి అందులో కేవలం 15 శాతం మాత్రమే అమలు చేసారని గుర్తుచేసారు. కానీ అన్నీ చేసామని చెప్పుకుంటున్న జగన్ మీరే నా సైన్యం అంటూ ప్రజలకు పిలుపునివ్వడం బాధాకరమని అన్నారు. గత ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలను వైసిపి నెమరువేసుకోవాలని సూచించారు.  

Also Read  రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యడంలేదు..: టిడిపి ఎంపీ గల్లా జయదేవ్

రాబోయే ఎన్నికలను ధర్మయుద్దమని, కురుక్షేత్ర సంగ్రామమని జగన్ అంటున్నాడు... తాను పాండవుల్లో అర్జునుడినని ఆయన చెప్పుకున్నాడని గంటా గుర్తుచేసారు. కానీ ప్రజలు మాత్రం వైసిపి నాయకులను కౌరవులుగా చూస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. వినాశనంతో ప్రారంభమైన జగన్ పాలన చివరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి ఆరోపించారు. అంతర్వేది రథ దగ్ధం, రామతీర్ధంలో రాముడి తల నరికివేత జరిగింది జగన్ పాలనలోనే అని గంటా గుర్తుచేసారు. 

2019 ఎన్నికల్లో వైసిపి విజయంకోసం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పనిచేసారని... ఇప్పుడు వాళ్లే వ్యతిరేకిస్తున్నారని గంటా అన్నారు. జగన్ వదిలిన బాణమే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నామన్నారు. వైసిపి అంటేనే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి,సజ్జల రామకృష్ణా రెడ్డి అని షర్మిల అంటున్నారు... దానికి సమాధానం చెప్పాలని గంటా నిలదీసారు. శ్రీలంకలో నియంతలా మారిన రాజపక్సేపై ప్రజలు ఎలా తిరుబాటు చేసినట్లే ఏపీ ప్రజలు తిరుగుబాటు చేస్తారని...  వైసిపిని సముద్రంలో కలపడం ఖాయమన్నారు. 

మూడేళ్ల క్రితం ఒక ఆశయం కోసం తాను రాజీనామా చేసానని... దాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని గంటా ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడో రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి నుంచి ఒక ఓటు తగ్గించడం కోసమే తన రాజీనామా ఆమోదించారని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

వీడియో

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios