ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్థులకు చదువు చెప్పి ఉన్నతమైనవారిగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరి బుద్ది వక్రమార్గం పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రాజవొమ్మడి మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు చదల సన్యాసిరెడ్డి, గుమ్మిడి నాగరాజు, పల్లలా గోపాలరావు, మఠం శాంతిబాబు, జీడెం సత్య నారాయణలు.. అదే స్కూల్‌లోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
ఈ మేరకు ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే డీఈవో ప్రాథమిక విచారణ జరిపి ఆ ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి శనివారం అడ్డతీగల జేఎఫ్‌ఎం కోర్టులో హాజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ వారికి రెండు వారాల రిమాండ్ విధించారు.
