ఏపీలో కరోనా విజృంభణ: మరో మరణం, కొత్తగా 45 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 45 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో మరణం సంభవించింది. నెల్లూరులో ఒకరు మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ప్రతి రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో మరో 45 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్ ను పరీక్షించగా 45 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,452కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
నెల్లూరులో తాజాగా ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 41 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు 1680 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 718కి చేరింది. తాజా మరణంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ మృతుల సంఖ్య 534కు చేరుకుంది.
Also Read: ఏపీలో మాస్కులతో విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు: వీరికి మినహాయింపులు
ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. 436 రూట్ల లో 1683 బస్సులు నడుస్తున్నాయి. బస్సు డిపోలు కళకళలాడుతున్నాయి. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
కాగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగులు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. దాంతో గురువారం ప్రభుత్వ కార్యాలయాలు సందడిగా కనిపించాయి. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. విజయవాడ, గుంటూరుల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు.