ఆ రాత్రి....కాళరాత్రి,  కడలి కల్లోలానికి కకావికలమైన తీరప్రాంత గ్రామాలు..  శవాల దిబ్బగా మారిన ఊళ్ళు.. నేటికీ మరువలేని చేదు జ్ఞాపకాలు. దివిసీమ ఉప్పెనకు 42 ఏళ్ళు పూర్తయి 15,341 రోజులు 43 ఏళ్ళు వచ్చాయి.

1977 నవంబర్ 19 శనివారం  తుఫాను వర్షం కురుస్తుంది. ఎప్పటిలాగే తీరం దాటుతుంది అని దివిసీమ ప్రజలు నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నారు.  ఆ రాత్రిని కాళరాత్రిగా మారుస్తూ ఒక్కసారి ప్రళయం ముంచెత్తింది.  మీటర్ల కొద్దీ (సుమారు 3 తాడిచెట్ల ఎత్తులో) ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు చెలియల కట్టలు దాటి ఊళ్ళు మీద విరుచుకు పడ్డాయి.  సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్లను కబళించాడు. నిద్రలోని వారిని శాశ్వత నిద్రలోకి తీసుకెళ్ళాయి. పశుపక్ష్యాదులు అల్లకల్లోలమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకొని పోయాయి.

తలచుకుంటేనే వొళ్ళు గగుర్పొడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ళకు కదలాడుతూనే ఉన్నాయి. ఉప్పెన దాటికి పొంగిన అలలు సుమారు 83 గ్రామాలను జలసమాధి చేస్తూ ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మనుషులు, పశువుల శవాలతో ఎటు చూసినా కూలిపోయిన ఇళ్లు, చెట్లు, కళ్ళముందే మనుషుల్ని, పశువుల్ని తాడిచెట్ల ఎత్తంత పరిణామానికి ఎగురవేస్తూ అతి భయంకరమైన విలయతాండవం సృష్టించింది. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, ఇరాలి, గొల్లపాలెం, బసవనిపాలెం, ఊటగుండం....

నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సోర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ తదితర మత్సకార ప్రాంతాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 33 లక్షల ఎకరాలలో పంటనష్టం వాటిల్లింది,  ఉప్పెన ప్రభావానికి దివిసీమ లో 10,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల అంచనా అయితే లెక్కకు తెలీకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్ని వేలో తెలీదు. ఒక్క నాగాయలంక మండలంలోని సోర్లగొంది గ్రామంలో 714 మంది, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెం లో 161 మంది చనిపోయినట్లు అధికారుల అంచనా. ఆనాటి రోజుల లెక్కల ప్రకారం 172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మత్సకారుల వలలు, పడవలు సైతం గల్లంతయ్యాయి. ఎన్నో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. చిమ్మ చీకట్లో వరద ఉధృతి విరుచుకు పడటంతో అనేకమంది కొట్టుకుపోతూ తుమ్మ, ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం విరుచుకుని పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విల్లులా వంగిపోయాయి.
సోర్లగొంది లోని రామాలయం, పంచాయతి కార్యాలయాలలో తలదాచుకుని 200 మంది ప్రాణాలతో బయట పడ్డారు.

కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోనూ ఉప్పెన ప్రభావం కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు కూడా ఈ ఉప్పెన దాటికి దెబ్బతిన్నాయి. నేటికి కూడా నవంబర్ నెల వచ్చిందంటే దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా తుఫాను సంభవిస్తే ప్రజలు బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అలాంటి ప్రళయం మళ్ళీ రాకూడదు అంటూ ఇక్కడి ప్రజలు నేటికి పూజలు చేస్తారు.

400మందిని కాపాడిన దేవాలయం
హంసలదీవిలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నాటి ప్రళయం దాటి నుండి 400 మందిని రక్షించింది. ఆనాటి మధ్యాహ్నమే ఆకాశంలో వచ్చిన మార్పులకు అక్కడి ప్రజలు దేవాలయంలో ఆశ్రయం పొందారు. సముద్రంలో ఉప్పొంగిన అలలతో ఊళ్ళు మనుషులు కొట్టుకుపోయినా ఈ దేవాలయంలోకి చుక్క నీరు కూడా చేరలేదు.


ఈ ఉప్పెన ఆంధ్ర దేశం మొత్తాన్ని వారం రోజుల పాటు కుదిపేసింది. నవంబర్ 14 నుండి 22 వరకూ చలి గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని గజగజలాడించింది.
మృతులు 10,000 మందికి పైనే
పశువులు 2.5 లక్షలకు పైనే
కోళ్లు 4 లక్షలు
ఇళ్ళు 8,504. అధికార అంచనా
ఆస్థి 172 కోట్లు
ఈ విపత్తుకు యావత్ భారతదేశం మొత్తం నివ్వెరపోయింది. ప్రభుత్వం మరియు మరికొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకున్నాయి. ఉప్పెనలో మరణించిన వారికి గుర్తుగా అవనిగడ్డ మండలం పులిగడ్డలో స్మారక స్థూపం నిర్మించారు.

సోర్లగొంది గ్రామాన్ని పోలీసు వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. అప్పటి మూలపాలెం ని rss వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, బండారు దత్తాత్రేయ లు కూడా ఈ ఊరుని సందర్శించారు.
(అప్పటి మూలపాలెం నేడు ధీనదయాళ పురం) సోర్లగొంది లో ఉప్పెన కు గుర్తుగా ఈ గ్రామ ప్రజలు ప్రతియేటా నవంబర్ 19 న సంబరాలు చేసుకుంటూ, యువకులకు ఆటల పోటీలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సంతాపం తెలియచేస్తారు.
ఆనాటి ఉప్పెన గురించి సోర్లగొంది లోని జాలయ్య పడే పాటలో ఉప్పెన విధ్వంసం మొత్తం మనకు వినిపిస్తుంది.