దటీజ్ గొట్టిపాటి రవికుమార్.. ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామానికి సోలార్ విద్యుత్ ప్లాంట్
ప్రకాశం జిల్లాలోని మారెళ్లలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ ప్లాంటును 80 రోజుల్లో పూర్తి చేయగా... గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చనుంది.
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్లలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శనివారం ప్రారంభించారు. ఓర్సీహెచ్ సంస్థ నిర్వహణలో ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంది. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంటును కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సోలార్ ప్లాంట్ నుంచి మారెళ్ల సబ్ స్టేషన్‌కు విద్యుత్ అనుసంధానం చేశారు. అనంతరం ఇది గ్రిడ్‌కు కనెక్ట్ అవుతుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడారు. సౌర, పవన విద్యుత్తుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్లలోని వ్యవసాయేత భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సోలార్ ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను అందజేస్తోందన్నారు.
గత ప్రభుత్వం హయాంలో కనీసం 100 మెగావాట్ల ఉత్పత్తి కూడా జరగలేదని మంత్రి రవికుమార్ ఆరోపించారు. దీంతో నాడు ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పలేదన్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ప్రజావసరాలకు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా విద్యుత్తును అందిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో సీఎం చంద్రబాబు సూచనతో సోలార్, విండ్, పీఎస్పీ వేస్ట్ మేనేజ్‍మెంట్ ప్లాంట్‍తో విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, దర్శి టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.