న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న 4 లక్షల ఓట్లను తొలగించారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ విషయమై ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పగించామన్నారు. ఏపీలో బాబుకు అనుకూలంగా ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల్లో కొనసాగించకూడదని కోరామన్నారు.

సోమవారం నాడు ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 52.67 లక్షల  నకిలీ ఓట్లు ఉన్నాయని  కేంద్ర ఎన్నికల సంఘానికి గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే  ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కార్ దొంగ ఓట్లను ఓటరు జాబితాలో నమోదు చేయించారని ఆయన ఆరోపించారు.

ఏపీ రాష్ట్రంలో 3 కోట్ల 69 లక్షల ఓట్లు ఉంటే అందులో సుమారు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని  వైఎస్ జగన్ ఆరోపించారు.సర్వేల పేరుతో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ఓటరు జాబితా నుండి తొలగిస్తున్నారని  ఆయన ఆరోపించారు. ఈ రకంగా వైసీపీ సానుభూతిపరులైన 4 లక్షల ఓటర్లను  తొలగించారని  ఆయన ఆరోపించారు.

ఏపీ రాష్ట్రంలో  చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన వారిని సీఐల నుండి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని జగన్ ఆరోపించారు. ఈ ప్రమోషన్ల జాబితాను కూడ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఇచ్చామని చెప్పారు.

లా అండ్ ఆర్డర్‌లో కోఆర్డినేషన్ పోస్ట్‌ను క్రియేట్ చేశారని జగన్ తెలిపారు. ఈ పోస్ట్‌లో కూడ తన సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌కు పోస్ట్ ఇచ్చారని జగన్ విమర్శించారు.

ఏపీ డీజీపీ ఠాకూర్  కూడ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. తనపై విశాఖలో జరిగిన దాడి ఘటన విషయంలో ఏపీ డీజీపీ ఠాకూర్  ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించాడని ఆయన ఆరోపించారు.

ఏపీ డీజీపీ, ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీపీ, లా అండ్ అర్డర్ కో ఆర్డినేషన్  పోస్టు నుండి ఎన్నికల విధుల నుండి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టుగా జగన్ చెప్పారు.

బాబు అవినీతితో సంపాదించిన సొమ్ము విషయమై తాము ప్రచురించిన పుస్తకాన్ని కూడ కేంద్ర ఎన్నికల సంఘానికి  ఇచ్చినట్టు ఆయన చెప్పారు. గత ఎన్నికల సమయంలో  ఒక్క శాతం ఒట్లతోనే బాబు ఏపీలో అధికారంలోకి వచ్చినట్టు చెప్పారు.

దేశంలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్  జరిగే అవకాశం ఉంటే.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించే  అవకాశం ఉందన్నారు. లాజిక్ అనేది లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఓటమి పాలయ్యే అవకాశం ఉందనే  భావించి ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టే ప్రయత్నాన్ని బాబు  చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

దొంగ ఓట్లపై సీఈసీకి జగన్ ఫిర్యాదు