కృష్ణా జిల్లాలో ఓ పెళ్లివేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
కృష్ణా జిల్లాలో ఓ పెళ్లివేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు బయలుదేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం.. మోపిదేవి మండలం కాశా నగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడినవారిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు.
ఇక, ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి బృందం వాహనంలో 20 మందికి పైగా ఉన్నారు. పరిమితికి మించి వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి..
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి - పుంగనూరు మార్గమధ్యలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్నవారు బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి వాసులు.. గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాన్ష్‌రెడ్డిగా గుర్తించారు.
