సరుకుల వాహనాల్లో 31 మంది కార్మికులు: హైద్రాబాద్ నుండి విజయనగరానికి జంప్
విజయనగరం: నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్న రెండు వాహనాల్లో 31 మంది హైద్రాబాద్ నుండి విజయనగరం వెళ్లిన వలస కార్మికులను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇవాళ లాక్ డౌన్ ను మే 3వ తేదీకి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
లాక్‌డౌన్ తో వలస కార్మికులకు పని లేకుండా పోయింది. హైద్రాబాద్ లో ఉంటున్న వలస కార్మికులు విజయనగరంలోని స్వగ్రామాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు.
హైద్రాబాద్ నుండి విజయనగరం జిల్లాకి వెళ్లేందుకు వాహనాలు లేవు. అయితే ఈ సమయంలో నిత్యావసర సరుకులను తరలించే వాహనాలను వలసకార్మికులు ఎంచుకొన్నారు.
నిత్యావసర సరుకులను తరలించే రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు హైద్రాబాద్ నుండి విజయనగరం బయలుదేరారు. సోమవారం నాడు రాత్రి విజయనగరం జిల్లా గజపతినగరంలోకి ఈ వాహనాలు ప్రవేశించాయి.
ఈ వాహనాలను పరిశీలించిన పోలీసులకు వాహనాల్లో వలస కార్మికులు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ వాహనాల్లో ఉన్న వలస కార్మికులను వాహనాల్లో నుండి దించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తరలించారు పోలీసులు.
ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి వలస కార్మికులనను క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే హైద్రాబాద్ నుండి విజయనగరం వరకు వలస కార్మికులు ఎలా చేరారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వలస కార్మికులను నిత్యావసర సరుకులు తరలించే వాహనంలో తరలించినందుకు ఈ రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు.