పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. పొలంలో పురుగుల మందు తాగి ఓ కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన దెందులూరు మండలం సింగవరంలో చోటుచేసుకుంది. 

దెందులూరు ఎస్ఐ రాంకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన పావులూరు వెంకట నారాయణ, అతని భార్య కృష్ణ తులసి, కుమారుడు భాను వికాస్ గుంటూరు రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్నారు.

బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వీళ్లు సింగవరం పొలాల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండడం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే  భాను వికాస్  మృతి చెందాడు.

అపస్మారక స్థితిలో ఉన్న వెంకటనారాయణ, కృష్ణతులసిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా వెంకటనారాయణ మృతి చెందాడు. ప్రస్తుతం కృష్ణతులసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ముగ్గురు గుంటూరు నుంచి దెందులూరు మండలానికి వచ్చి ఎందుకు ఆత్మహత్య పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీని మీద మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు.