Asianet News TeluguAsianet News Telugu

ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు. 

3 new judges take oath as judges of AP High Court
Author
Amaravathi, First Published May 2, 2020, 1:38 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ మేరకు హైకోర్టులోని ఒకటవ నెంబర్ హాల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జితేంద్ర కుమార్ మహేశ్వరి నూతనంగా నియమితులైన న్యాయమూర్తులచే శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. 

తొలుత హైకోర్టు  ఇన్ చార్జ్ రిజిస్ట్రార్‌ జనరల్‌ బి. రాజశేఖర్  న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత దస్త్రాలపై సంతకాలు చేశారు.

కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి బాగా ఉన్న నేపథ్యంలో జడ్జిల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పూర్తి భౌతిక దూరాన్ని పాటించారు. అన్ని నియమాలకు అనుగుణంగా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి కళ్లెం పడడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 62 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,525కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 33 మంది మరణించారు.   

గత 24 గంటల్లో 5943 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 441 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1051 ఉంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

కర్నూలు జిల్లా కరోనా వైరస్ తో అట్టుడుకుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 12 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. గుంటూరు జిల్లాకు కొంత ఊరట లభించింది. గత 24 గంటల్లో 2 కరోనా కేసులు మాత్రమే బయటపడ్డాయి. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 4 కేసులు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. కర్నూలు జిల్లా 436 కేసులతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గుంటూరు జిల్లా 308 కేసులతో రెండో స్థానంలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios