రాయచోటి లో విషాదం : డీజీల్ ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లి ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో పెట్రోల్ బంక్ లో డీజీల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలోని పెట్రోల్ బంక్ లో డీజీల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు మృతదేహలతో ఆందోళనకు దిగారు . తమకు న్యాయం చేయాలని కోరారు. మృతికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రాయచోటిలోని ఓ పెట్రోల్ బంక్ లో ఉన్న డీజీల్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు సోమవారంనాడు ముగ్గురు కార్మికులు దిగారు. అయితే ఈ ముగ్గురు కార్మికులు డీజీల్ ట్యాంకులోకి దిగిన సమయంలో విష వాయువులు వెలువడి మృతి చెందారు. డీజీల్ ట్యాంక్ లోకి దిగిన కార్మికులు బయటకు రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి బంక్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా కష్టపడి డీజీల్ ట్యాంకులో పడిపోయిన ముగ్గురిని బయటకు తీసుకు వచ్చారు. ఐదేళ్లుగా డీజీల్ ట్యాంకును శుభ్రపర్చలేదు. అయితే ఇవాళ శుభ్రపర్చేందుకు కార్మికులు దిగారు. అయితే డీజీల్ ట్యాంకులో విషవాయివులు వెలువడడంతో ఈ ముగ్గురు మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. డీజీల్ ట్యాంక్ నుండి బయటకు తీసిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.
మృతి చెందినవారు హెచ్‌పీసీఎల్ కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందినవారు. కడప జిల్లాలోని పెండ్లిమర్రికి చెందిన రవి, ఆనంద్ , సీకే దిన్నె కు చెందిన శివ గా గుర్తించారు.