Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. డోన్‌లో భార్యాభర్తలకు పాజిటివ్, భయాందోళనలో జనం

కర్నూలు జిల్లాలో (kurnool district) కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) కలకలం రేగింది. డోన్‌లో బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. 

2 omicron cases found in kurnool district
Author
Kurnool, First Published Dec 29, 2021, 10:31 PM IST

కర్నూలు జిల్లాలో (kurnool district) కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) కలకలం రేగింది. డోన్‌లో బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దుబాయ్‌లో బంధువుల దగ్గరకు వెళ్లొచ్చిన దంపతులకు పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఆ దంపతులను క్వారంటైన్‌కు తరలించారు.

రాష్ట్రంలో బుధవారం మొత్తం పది ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఇందులో కర్నూలు జిల్లా కూడా చేరిపోవడం గమనార్హం.  ఈ విషయంపై జిల్లా వైద్య  ఆరోగ్య అధికారి డాక్టర్ రామ గిడ్డయ్య మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకిన ఇద్దరూ డోన్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దుబాయ్ కి వెళ్లి వచ్చిన వీరిద్దరూ ఈనెల 20వ తేదీన డోన్ పట్టణానికి చేరుకున్నారు. అనంతరం జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 23న కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 

ALso Read:ఏపీలోనూ ఒమిక్రాన్ అలజడి.. ఒకేసారి 10 కొత్త కేసులు, 16కి చేరిన సంఖ్య

పరీక్షల్లో వారికి పాజిటివ్ అని తేలడంతో వారితో పాటు వారిని కలిసిన బంధువులను, వారు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల సిబ్బంది నుండి నమూనాలను సేకరించారు.   అయితే వైరాలజీ ల్యాబ్‌ రిపోర్ట్‌లో ఈ జంటకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒమిక్రాన్ బారిన పడ్డ దంపతులను వారి ఇళ్ల వద్దే హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు.  ఒమిక్రాన్ పాజిటివ్ దుబాయ్ రిటర్నీలతో పాటు జిల్లాలో ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన 1200 మందిని గుర్తించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. వీరందరి నుంచి నమూనాలు సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇకపోతే కరోనా కొత్త వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 16కి చేరింది. తూగో జిల్లాలో 3, అనంతలో 2, కర్నూలు 2, గుంటూరు, చిత్తూరు, ప.గో జిల్లాలో ఒక్కో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios