లారీ, అంబులెన్స్ ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి సమీపంలో చోటుచేసుకుంది. పెషెంట్ ని  తీసుకొని బెంగుళూరు నుంచి నెల్లూరు వెళుతున్న ఓ అంబులెన్స్  సోమవారం ఉదయం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సమీపంలో నాయుడుపేట-పూతల పట్టు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్‌ నిద్రమత్తులో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో డ్రైవర్‌ తో పాటు రోగి మృతిచెందారు. అంబులెన్స్ పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.