పిడుగుపాటుకి 18మంది మృతి

First Published 2, May 2018, 10:15 AM IST
18 dead for hail storm in Andhra Pradesh
Highlights

ఏపీలో అకాల వర్షాలు

ఏపీలో అకాల వర్షాలు రైతాంగాన్ని అతలా కుతలం చేసేసింది. వర్ష బీభత్సానికి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు.. మంగళవారం పలు జిల్లాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వణికించాయి.

ఆరు జిల్లాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. సముద్రంలో వేటకు వెళ్లిన పడవలపై పిడుగులు పడిన రెండు ఘటనల్లో మరో నలుగురు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో పిడుగుపాటుకు 17 మంది, ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తాటిచెట్టు పడి ఒకరు మరణించారు.

ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు పడి పలుచోట్ల సరఫరా నిలిచింది. విజయవాడ నగరంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీవృక్షాలు, హోర్డింగులు నేలకూలి రాకపోకలు స్తంభించాయి.

విక్రయానికి తెచ్చిన 1.20లక్షల బస్తాల ధాన్యం, 50వేల బస్తాలకు పైగా మొక్కజొన్న వర్షపు నీటిలో తడిచింది. కళ్లాల్లోని మిర్చి, మొక్కజొన్న కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. కోత దశకు చేరిన మామిడి రాలిపోయింది. వేలాది ఎకరాల్లో అరటి తోటలు నేలకరిచాయి. 

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో వ్యాపారులు, రైతులు ఆరుబయట నిల్వ ఉంచిన లక్ష బస్తాల ధాన్యం, యాభైవేల బస్తాల మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దయ్యాయి. రాజుపాలెం మండలం అంచులవారిపాలెం, మేడికొండూరు మండలంలో మామిడికాయలు నేలరాలాయి.

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లంకలో దాదాపు 220 ఎకరాల్లో అరటితోటలు దెబ్బతిన్నాయి. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం, రెంటచింతల, మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.గుంటూరు నగరంలో విద్యుత్తు స్తంభాలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకూలాయి.

సాయంత్రం నుంచి కొన్ని గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచింది. గన్నవరం మండలం చిన్నపల్లివారిగూడెం, విజయవాడ నగరం కబేళా ప్రాంతంతో పాటు పలుచోట్ల పిడుగులు పడి ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయవాడలోని బీసెంటురోడ్డు, ఒన్‌టౌన్‌, బందర్‌రోడ్డుల్లో భారీ వృక్షాలు నేలకూలి.. ట్రాఫిక్‌ నిలిచింది.

గొల్లపూడి మార్కెట్‌ యార్డుకు రైతులు తెచ్చుకున్న 10వేల బస్తాల ధాన్యం తడిచింది. జిల్లాలో ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది. మామిడి భారీగా నేల రాలింది. అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 1000 ఎకరాలకు పైనే పంట నష్టం ఉంటుందని అంచనా. 

loader