సొంత అక్క మొగుడే ఆమె మీద కన్నేశాడు. తెలిసీ తెలియని వయసు కావడంతో ఆమె కూడా ఆ మాయలో పడిపోయింది. ఫలితంగా గర్భం దాల్చింది. కనీసం మైనార్టీ కూడా తీరలేదు. ఈలోపే బావ కామ వాంఛకి బలైపోయింది. తాను గర్భవతినన్న విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుందని భయపడింది. కడుపులో పెరుగుతున్న పిండాన్ని చిదిమేస్తే సరిపోతుంది కదా అని అనుకున్నారు. అదే చేశారు. కానీ.. ఆ ప్రయత్నం వికటించింది. చివరకు సదరు బాలికే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంచిలి మండలానికి చెందిన కిరణ్‌ కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఆ సమయంలో తన భార్య చెల్లెలిపై కన్నేశాడు. తెలిసీ తెలియని వయసు కావడంతో బాలిక కూడా బావ చేస్తున్న పనిని కాదనలేకపోయింది. వారి సానిహిత్యాన్ని బాలిక తల్లి పలు మార్లు గమనించింది కూడా. ఇద్దరినీ మందలించింది. కాగా.. ఆ తర్వాత కిరణ్ కోల్ కతా వెళ్లిపోయాడు.

ఆయన వెళ్లిపోయాక బాలిక గర్భవతి అని తల్లికి తెలిసింది. దీంతో అనుమానం వచ్చి బాలికను నిలదీయగా.. బావతో ఉన్న సంబంధాన్ని బయట పెట్టింది. దీంతో ఆమె కోల్‌కతాలో ఉన్న అల్లుడికి ఫోన్‌ చేసి ప్రశ్నించారు. తాను లాక్‌డౌన్‌లో చిక్కుకున్నానని, ప్రస్తుతానికి అబార్షన్‌ చేయించాలని, డబ్బులు పంపిస్తానని చెప్పాడు. 

దీంతో చేసేదేమీ లేక ఈ నెల 8న సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్‌ చేయించారు. అయితే ఈ నెల 16వ తేదీన బాలికకు తీవ్ర రక్తస్రావమై కడుపులో నొప్పి రావడంతో తిరిగి సోంపేట వైద్యులను సంప్రదించారు.

వారి సూచనల మేరకు శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రికి కూడా అదే రోజు సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ నుంచి రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం బాలిక మృతి చెందింది. అబార్షన్‌ సరిగా చేయకపోవడం వల్ల బాలిక మృతి చెందిందని రిమ్స్‌ వైద్యులు నిర్ధారించారని మృతురాలి తల్లి పోలీసులకు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.