30 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు రోడ్డు ప్రమాాదానికి గురవడంతో చిన్నారులు గాయపడ్డారు. ఈ దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం విద్యార్థులను తీసుకువెళుతున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో 15 మంది చిన్నారులు గాయాలపాలవగా మరో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తమపురం గ్రామానికి చెందిన విద్యార్థులు రొట్టవలసలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. దాదాపు 30 మంది విద్యార్థులు రోజూ స్కూల్ బస్సులో వెళ్లివస్తుంటారు. ఇటీవలే స్కూల్స్ పున:ప్రారంభం కాగా రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం కూడా విద్యార్థులు బస్సులో స్కూల్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో బస్సు ప్రమాదానికి గురయి విద్యార్థులు గాయపడ్డారు.
పురుషోత్తపురం గ్రామ సమీపంలోని చెరువు వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు వుంటే 15మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా 15 మంది విద్యార్థులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
Read More విశాఖలో అమానుషం... చిత్రహింసలు పెడుతూ వివాహితపై అత్యాచారం, హత్య
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తలకి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడికి సమయానికి చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. స్కూల్ బస్సు ప్రమాదం గురించి తెలిసి కంగారుపడిపోయిన తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
