కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను వెనకనుండి వచ్చిన కారు ఢీకొట్టడంతో 14మంది తీవ్రంగా గాయపడగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వుంది. 

విజయవాడ: కృష్ణా జిల్లా (krishna district)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటోను వెనకవైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14మంది కూలీలు తీవ్రంగా గాయపడగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లాకు చెందిన కొందరు కూలీలు ఆటోలో మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. గూడూరు మండలం పర్ణశాల గ్రామం వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను వెనకవైపు నుండి ఢీకొట్టింది. దీంతో ఆటోలోని కూలీలంతా గాయపడ్డారు. 

వెంటనే గాయపడిన కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఆరుగురు కూలీల పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ కు తరలించారు. 

ఈ ప్రమాదంలో గాయపడినవారంతా మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతానికి చెందిన మహిళలుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందినవెంటనే పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు హాస్పిటల్ కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన మహిళా కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

ఇదిలావుంటే తెలంగాణలోని నారాయణఖేడ్ పట్టణంలో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదం భార్యాభర్తలను బలితీసుకుంది. బైక్ యూ ట‌ర్న్ తీసుకుంటున్న స‌మ‌యంలో ఓ లారీ వేగంగా వ‌చ్చి ఢీకొట్టడంతో దంప‌తులు మృతి చెందారు.

 కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండ‌లం జ‌లాల్ పూర్ కు చెందిన బేగ‌రి ల‌క్ష్మ‌య్య (60), చిత్ర‌మ్మ (57) భార్యాభ‌ర్తలు. వారు నిన్న(శ‌నివారం) బైక్ పై నారాయణఖేడ్ మనూరు మండ‌లం తిమ్మాపూర్ లో ఉన్న బంధువుల ఇంటికి బైక్ పై బయలుదేరారు. ఈ క్రమంలో సంగారెడ్డి - నాందేడ్ నేష‌నల్ హైవేపై ప్రయాణిస్తుండగా నిజాంపేట స‌మీపంలోని బ్రిడ్జిపై బైక్ ను యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీకొట్టింది. దీంతో భార్య చిత్రమ్మ అక్కడికక్కడే చనిపోగా భర్త లక్ష్మయ్య హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.