AP Trains Accident : విజయనగరం రైలు ప్రమాదం... 14 కు చేరిన మృతుల సంఖ్య
విజయనగరంలో రెండు ప్యాసింజర్ రైళ్లు, ఓ గూడ్స్ రైలు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 14 కు చేరింది.

విజయనగరం : ఆంధ్ర ప్రదేశ్ లో గత రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 14మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నా ఈ సంఖ్య వందకుపైనే వుంటుందని సమాచారం. క్షతగాత్రులు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
నిన్న(ఆదివారం) రాత్రి 7 గంటల సమయంలో విశాఖ-రాయగఢ రైలు వేగంగా దూసుకువచ్చి సిగ్నల్ కోసం ఆగివున్న విశాఖ-పలాస రైలును ఢీకొట్టింది. విజయనగరం జిల్లాలోని కంటకపల్లి-అలమండ మధ్య ఈ ప్రమాదం జరిగింది. ముందున్న ప్యాసింజర్ రైలును మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టి ఆ పక్కనే వున్నగూడ్స్ రైలుపైకి దూసుకెళ్లింది. ఇలా ప్రయాణికులతో కూడిన రెండు రైళ్లు, మరో గూడ్స్ రైలుతో కలిపి మొత్తం ఏడుబోగీలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో రెండు ప్యాసింజర్ రైళ్లలో దాదాపు 1400 మంది ప్రయాణికులు వున్నట్లు రైల్వే అధికారుల నుండి సమాచారం అందుతోంది.
విశాఖ-రాయగడ రైలు వేగంగా వచ్చి విశాఖ-పలాస రైలును ఢీకొనడంతో బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఓ రైలు ముందుభాగం, మరోరైలు వెనకభాగంలోని బోగీలు దెబ్బతిన్నాయి. ఓ రైలులోని ఇద్దరు లోకో పైలట్లు... మరో రైలు వెనకాల బోగీలోని గార్డు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలామంది ప్రయాణికులు రెండురైళ్ల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా...కొందరు గాయాలతో బయటపడ్డారు.
Read More విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి , సహాయక చర్యలకు ఆదేశం
రాత్రి సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో చీకట్లో ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థంకాలేదు. రెండు రైళ్లు ఢీకొని ఆగగానే ప్రయాణికులంతా కిందకుదిగా భయంతో పరుగుతీసారు. ఇక బోగీల్లో చిక్కుకున్న కొందరు ప్రాణాలు కోల్పోగా మిగతావారు నరకయాతన అనుభవించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు, ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముందుగా గాయాలతో బోగీల్లో చిక్కుకున్నవారిని కాపాడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందేలా చూసారు. ఇలా గాయపడిన వందలమంది ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో చికిత్సపొందుతున్నారు... వీరిలో తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా వుంది.
ప్రమాద తీవ్రత, హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితిని బట్టిచూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగేలా వుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకే అధికారులు మృతుల సంఖ్యను వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 30 నుండి 40 వరకు వుండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.