శ్రీకాకుళం, విశాఖ జిల్లాల‌కు చెందిన 66 మంది చార్‌ధామ్‌ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. తామంతా బద్రీనాథ్‌ కొండపై బస్టాండ్‌ సమీపంలో చిక్కుకున్నామని, ఆపదలో ఉన్న తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్‌ చేరుకోగా, ఎడతెరిపిలేని మంచు వర్షం కురిసిందని, దీంతో కొండ పైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం తెలిపింది. 

మరో మూడు రోజుల పాటు మంచు వర్షం కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరిస్తోందని, ప్రస్తుతం చిమ్మచీకటిలో తాము మగ్గుతున్నామని బాధిత యాత్రికులు భయాందోళనలు వ్యక్తంచేశారు. తాము ప్రయాణించే బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని, ప్రభుత్వం సత్వరం స్పందించి తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న ఛార్‌ధామ్ యాత్ర‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడిన వారే. 

కాగా.. యాత్రికులంతా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఎంపీ రామ్మోహన్‌నాయుడు యాత్రికులతో ఎప్పకప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీభవన్‌ అదనపు కమిషనర్‌ శ్రీకాంత్, టీడీపీపీ కార్యాలయ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
 
మరోవైపు బద్రీనాథ్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఉత్తరాఖండ్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన అచ్చెన్నాయుడుయాత్రికులు క్షేమంగా శ్రీకాకుళం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.