తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఎర్రచందనం స్మగ్లర్ జబర్దస్త్ హరి గురించి తవ్వేకొద్ది అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతికి చెందిన వై.హరిబాబు బడా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని శేషాచలం అడవుల్లో ఎర్రదుంగలను గుట్టుచప్పుడు కాకుండా తరలించడంలో ఆరితేరాడు. 2012 నుంచి నేటి వరకు ఈ దందాలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు.

నటన మీద ఆసక్తితో సీరియల్స్‌లో చిన్న చిన్న వేషాలు వేయడంతో పాటు జబర్దస్త్‌లో స్కిట్లలో పాల్గొనేవాడు. అలా నటనలో జిగీగా ఉంటూనే తన ముఠా సభ్యులతో టచ్‌లో ఉంటూ.. ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించాడు.. ఈ ఆరేళ్లలో ఇతను వంద టన్నుల వరకకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.. ఎర్రచందనాన్ని కొనడంతో పాటు ఇతరులను బెదిరించి వారి దగ్గరున్న దుంగలను లాక్కొని స్మగ్లింగ్‌కు పాల్పడేవాడు.. విద్యార్ధులకు డబ్బును ఎరగా వేసి... వారి ద్వారా ఎర్రచందనాన్ని తరలించేవాడని తెలుస్తోంది.

ఇలా సంపాదించిన సొమ్మును అనేక సినిమాలకు పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా షకలక శంకర్ హీరోగా నటించిన ఓ సినిమాకు హరిబాబు ఫైనాన్స్ చేసినట్లు గుర్తించారు. ఇతనిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. ఇంత జరిగినా ఇతను ఒక్కసారి కూడా అరెస్ట్ కాకపోవడం గమనార్హం. హరిబాబును అరెస్ట్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు..