ఇంజనీరింగ్ చదువుతున్న ఓ అమ్మాయి.. పెద్దమ్మ కూతురి ఇంట్లో ఉంటూ కాలేజీకి వెడుతోంది. కొంతకాలంగా ఆమె ముభావంగా ఉండడంతో ఏం జరిగిందని అక్క ఆరా తీసింది. విషయం చెప్పలేదు. చివరికి గద్దించి అడిగితే చచ్చిపోతానంటూ ఏడ్చేసింది. దీంతో షాక్ అయిన ఆ అక్క సముదాయించి విషయం అడిగితే ఫోన్ చూపించింది.

ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే తీసిన వీడియో అది. దాన్ని ఎవరో తీయడమే కాకుండా ఏదో వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. అది స్నేహితురాలి ద్వారా తెలియడంతో ఆ అమ్మాయి షాక్ అయింది. దీంతో విషయం తెలసుకున్న అక్క, చెల్లెని వెంటబెట్టుకుని సైబర్ క్రైంకు వెళ్లి ఫిర్యాదు చేసింది. 

అక్కడ దర్యాప్తులో తెలిసిన నిజం వారిని తేరుకోలేని షాక్ లో పడేసింది. ఆ వీడియో తీసింది ఎనిమిదో తరగతి చదువుతున్నఅక్క కొడుకే అని తెలిసింది. దీంతో ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేయగా అలాంటి పదికిపైగా వీడియోలు కనిపించాయి. పన్నెండేళ్ల కుర్రాడు ఇలా ఎందుకు చేశాడో తెలిసి మరోసారి షాక్ అయ్యారు.  

అక్క, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే.. దీంతో పిల్లాడి ఆన్ లైన్ క్లాసులు, ఆ తరువాత కాలక్షేపం కోసం స్మార్ట్ ఫోన్, గేమ్స్ ఆడుకోవడానికి ఐపాడ్ ఏర్పాటు చేశారు. అయితే స్కూల్ టైం అయిపోయాక ఆ అబ్బాయి ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడేవాడు. అలా ఆన్ లైన్ ఫ్రెండ్స్ గ్రూప్ లో చేరాడు. 

అక్కడ ట్రూత్ అండ్ డేర్ లో భాగంగా ఇలాంటి వీడియోలు తీసి షేర్ చేశాడని తెలిసి షాక్ అయ్యారు. ఇది ఈ ఒక్క కేసులోనే కాదు 2020 క్రైమ్ లెక్కల ప్రకారం విజయవాడతో సహా క్రిష్ణాజిల్లాలో 220 లైంగిక వేదింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువమంది నిందితులు మైనర్లే. ఫోర్న్ వీడియోలు చూసి, ఈ నేరాలకు పాల్పడ్డామని అంగీకిరంచారు. 

రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న అనేక కేసుల్లో టీనేజర్లది ఇదే పరిస్తితి అని పోలీసులు అంటున్నారు. అందుకే పిల్లలు డిజిటల్ వాతావరణంలో పెరుగుతున్నప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రుల చెకింగ్ ఉండాలని చెబుతున్నారు.