కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల వాహనం ఢీకొని పదో తరగతి విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు. దేవనకొండకు చెందిన కౌలుట్ల, లక్ష్మీ దంపతుల కుమారుడు కాశీం .. తండ్రి అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మరణించడంతో అతని తల్లే కష్టపడి చదివిస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి కాశీం తన బంధువు నాగేంద్రతో కలిసి పొలానికి నీరు కట్టడానికి బైక్‌పై వెళ్లాడు. అక్కడ పొలానికి నీరు పెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఆలూరు నుంచి గుడిమిరాళ్లకు వెళ్తున్న స్కార్పియో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది

కాశీం, నాగేంద్రలకు తీవ్ర గాయాలు కావడంతో వీరిని వెంటనే పత్తికొండ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు తీసుకెళ్తుండగా కాశీం మార్గమధ్యంలోనే మరణించాడు.

ప్రమాదానికి కారణమైన కారు వైసీపీ నేతలకు చెందినదిగా పోలీసులు తెలిపారు. వీరంతా ఆదివారం వైసీపీలో చేరేందుకు ఆలూరు వెళ్లి వస్తున్నారు. భర్త లేకపోవడంతో కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తల్లికి కాశీం మరణవార్త శరాఘాతంలా తగిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.