ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. బోటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వంద మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గంటన్నరపాటు గడిపారు.

తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి నుండి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి బోటులో సుమారు వంద మంది గురువారం రాత్రి బయలుదేరారు.  వీరంతా నదిలో  ప్రయాణిస్తున్న సమయంలోనే బోటులో డీజీల్ అయిపోయింది. దీంతో  నది మధ్యలోనే బోటు నిలిచిపోయింది. అంతేకాదు ఆ సమయంలో గాలులు బలంగా వీయడంతో బోటు సముద్రం వైపుకు వెళ్లిపోయింది.

అయితే నది మధ్యలో చేపల కోసం మత్స్యకారులు వేసిన వలలు, కర్రలు బోటుకు అడ్డుగా రావడంతో బోటు అక్కడే నిలిచిపోయింది.ఈ సమయంలో భయానికి గురైన ప్రయాణీకులు బోటు నుండే తమ బంధువులకు సమాచారాన్ని చేరవేశారు. 

నాటు పడవల సహాయంతో  స్థానికులు, జాలర్లు  బోటు వద్దకు చేరుకొని  బోటులో ఉన్నవారిని సురక్షితంగా  ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత బోటులో డీజీల్ నింపడంతో  ఆ బోటు కూడ  ఒడ్డుకు చేరింది.

ప్రతి ఎన్నికల సమయంలో  రాజకీయపార్టీల నేతలు ఈ ప్రాంతంలో వంతెన ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి కూడ వాటిని నెరవేర్చలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు.