Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: 200వ రోజుకు చేరుకున్న కార్మికుల ఉద్యమం.. భారీ మానవహారం

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ప్రజా సంఘాలు చేపట్టిన ఉద్యమం ఆదివారం నాటికి 200వ రోజుకు చేరుకుంది

10 km long human chain in protest against privatisation of Vizag steel plant
Author
Visakhapatnam, First Published Aug 29, 2021, 7:01 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ప్రజా సంఘాలు చేపట్టిన ఉద్యమం ఆదివారం నాటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు నగరంలో భారీ మానవహారాన్ని చేపట్టాయి. అగనంపూడి నుంచి అక్కిరెడ్డి పాలెం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో గాజువాక వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 10 కి.మీ మానవహారంలో ఉక్కు పరిశ్రమ కార్మికుల కుటుంబాలు, విశాఖ నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవహారం, ర్యాలీ నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ALso Read:విశాఖ ఉక్కు కర్మాగారంపై టాటాల కన్ను..

మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు బడా కంపెనీలు ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో టాటా స్టీల్ ముందు వరుసలో వున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ నిర్థారించారు. ప్రస్తుతం విశాఖలో వున్న కర్మాగారం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలో సముద్ర తీరాన వున్న అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా దీనికి ప్రత్యేకత వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios