Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి జిల్లాలో ఘోరం... బస్సు-లారీ ఢీకొని ఒకరు మృతి, 15 మందికి గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్టిసి బస్సు, లారీ ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా మరో 15మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. 

1 killed and 15 injured in road accident in alluri district
Author
Paderu, First Published Jun 30, 2022, 4:05 PM IST

పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు, లారీ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సీలేరు నుండి ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టిసి బస్సు, భద్రాచలం నుండి వస్తున్న సిమెంట్ లారీ తూలుకొండ వద్ద ఎదురుపడ్డాయి. చిన్న రోడ్డుపై రెండు పెద్ద వాహనాలు వేగంగా వెళుతూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.  

ఇక బస్సు డ్రైవర్ తో పాటు అందులోని ప్రయాణికులు కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బస్ డ్రైవర్ శ్రీనుకు రెండు కాళ్లు విరిగిపోగా కొందరికి తలలు పగలడం, మరికొందరికి చిన్నచిన్న గాయాలయ్యాయి. ఇలా మొత్తం 15మంది గాయాలపాలయ్యారు. లారీ, బస్సు ముందుభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను చింతూరు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ఇక ఘటనాస్ధలం నుండి లారీ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు పెద్ద వాహనాల అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. రెండు వాహనాలు డ్రైవింగ్ క్యాబిన్ల వైపే ఢీకొనడంతో ఓ డ్రైవర్ మృతిచెందగా మరో డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 

ఇదిలావుంటే గురువారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకోసం కూలీలు ఆటోలో వెళుతుండగా  తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో కొందరు మహిళలు సజీవదహనం అయ్యారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా తాడిమర్రి మండలానికే చెందిన పెద్దకొట్టాల పంచాయితీ గుడ్డంపల్లికి చెందినవారిగా గుర్తించారు.

కూలీల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.  హైటెన్షన్ విద్యుత్ వైర్ల నుండి నిప్పురవ్వలు రావడం గమనించామని... వెంటనే విద్యుత్ అధికారులు అప్రమత్తమై  చర్యలు తీసుకుని వుంటే ఇంత మారణహోమం జరిగేది కాదని అభిప్రాయపడుతున్నారు. మహిళల మృతితో ధర్మవరం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. మృతుల స్వగ్రామం గుడ్డంపల్లిలో అయితే కూలీల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.  ప్రమాదం జరిగిన చిల్లకొండాయపల్లి వద్ద కూడా భయానక వాతావరణం నెలకొంది. ఆటోతో పాటు మృతదేహాలు మంటల్లో కాలుతుండటంతో రోడ్డే ఓ స్మశానవాటికను తలపిస్తోంది. 

ఈ ప్రమాదంలో మరణించిన వారంతా మహిళలేనని గుర్తించారు. మృతుల్లో గుడ్డంపల్లి వాసులే కాకుండా పెద్దకోట్ల గ్రామస్తులు కూడా వున్నట్లు సమాచారం. వీరిలో గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు. ఆటోలో మొత్తం డ్రైవర్ తో సహా 12మంది వుండగా కొందరు మృతిచెందగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 

కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను ట్రాక్టర్‌లో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుల ఇంటివద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios