జువెల్లర్స్ యజమాని ఫ్యామిలీని తాళ్లతో కట్టేసి... కిలో బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
అర్ధరాత్రి జువెల్లరీ షాప్ యజమాని ఇంట్లో చొరబడిన దుండగులు కిలో బంగారం, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన ఫశ్చిమ గోదాావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది.

తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారీ దొంగతనం జరిగింది.అర్ధరాత్రి బంగారు వ్యాపారి ఇంట్లో చొరబడ్డ ఐదుగురు దొంగల ముఠా కిలో బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ దొంగతనం వ్యాపారి దగ్గర పనిచేసే యువకుడి పనిగా అనుమానిస్తున్నారు.
పోలీసులు, బాధిత బంగారు వ్యాపారి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకు పట్టణంలో ఓ స్వర్ణకారుడు ఆభరణాలను తయారుచేస్తుంటాడు. రోజంతా షాప్ లో ఆభరణాల తయారీ చేపట్టే అతడు రాత్రి బంగారాన్ని షాప్ లో పెట్టకుండా ఇంటికి తీసుకెళుతుంటాడు. ఇలా రోజూ మాదిరిగానే నిన్న(మంగళవారం) రాత్రి కూడా భారీగా బంగారాన్ని అతడు ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు అర్ధరాత్రి వ్యాపారి ఇంట్లో చొరబడి బంగారంతో పాటు కొంత నగదు దోచుకెళ్లారు.
ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు దుండగులు మొదట స్వర్ణకారుడితో పాటు కుటుంబసభ్యులను తాళ్లతో కట్టేసారు. కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలు ఎక్కడ దాచారో తెలుసుకున్నారు. ఇలా ఇంట్లోని కిలో బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును దుండుగులు దోచుకుని పరారయ్యారు. ఎలాగోలా కట్లు విప్పుకున్న బాధిత కుటుంబం పోలీసులకు సమాచారం అందించారు.
Read More లోన్ కోసం వెళితే లోబర్చుకోబోయాడు... మహిళపై ఫైనాన్స్ సంస్థ యజమాని అత్యాచారయత్నం (వీడియో)
దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించిన పోలీసులు వ్యాపారి నుండి వివరాలు సేకరించారు. తన షాప్ లో పనిచేసే సూరజ్ అనే యువకుడిపై వ్యాపారి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన ఇంట్లో భారీగా బంగారం వున్న విషయం సూరజ్ కి తెలుసని... మరికొందరితో కలిసి అతడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు స్వర్ణకారుడు చెబుతున్నాడు. బాధిత వ్యాపారి పిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తణుకు పోలీసులు. ప్రస్తుతం పరారీలో వున్న సూరజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.