ఆ బిడ్డలను పొట్టనపెట్టుకున్నదే కేసీఆర్... అవన్నీ హత్యలే.: షర్మిల సంచలనం

Oct 12, 2022, 11:29 AM IST

కామారెడ్డి : తెలంగాణలో నిరుద్యోగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని... వందలాదిమంది డిగ్రీలు, పీజిలు చదివిన బిడ్డలు ఉద్యోగాల రాక చనిపోతుంటే దున్నపోతు మీద వాన పడ్డట్లుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల మండిపడ్డారు.  ఆ దున్నపోతుకయినా చలనం వుంటుందేమో కానీ ఈ కేసీఆర్ కు లేదని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్య కేసీఆర్ చేసిన హత్యలేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆరే ఇంతమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మహాప్రస్థాన పాదయాత్ర నిజాంసాగర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా నిన్న(మంగళవారం) నిజాంసాగర్ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ యువతను ఎలా రెచ్చగొట్టారో వివరించారు. ఆంధ్రా పాలనలో పోటీ పరీక్షలు రాయొద్దని యువతను రెచ్చగొట్టిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారని కన్నీరు కార్చిన కేసీఆర్ నేడు కొలువులు లేక యువత చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదు? ఆయన ఉద్యమ సమయంలో కార్చింది మొసళి కన్నీరా? అని షర్మిల మండిపడ్డారు.