బురద కాళ్లతో స్కూల్ కి వచ్చారని... విద్యార్థులను చితకబాదిన కసాయి టీచర్

Oct 20, 2022, 10:32 AM IST

కరీంనగర్ : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు అత్యంత కర్కషంగా వ్యవహరించింది. విద్యార్థులను తన బిడ్డల్లా ప్రేమగా చూసుకుంటూ చదువు నేర్పాల్సింది పోయి ఏవో చిన్నచిన్న కారణాలు చూపుతూ కోపంతో ఊగిపోయిన టీచర్ చిన్నారులను వాతలుతేలేలా గొడ్లను బాదినట్లు బాదింది. ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  మానుకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు రాంచరణ్, విష్ణువర్ధన్, ఆదర్శ్, శివ, విష్ణు, ప్రవీణ్ వర్షంలో స్కూల్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే వారి చెప్పులకు బురద అంటడంతో స్కూల్ వరండాలో అది తొలగించుకునే ప్రయత్నం చేసారు. ఇది చూసిన టీచర్ రాజ్యలక్ష్మి స్కూల్ వరండాను పాడుచేస్తున్నారంటూ విద్యార్థులపై చిందులు తొక్కింది. ఆరుగురు విద్యార్థులను అత్యంత దారుణంగా కర్రతో చితకబాదింది. ఇలా టీచర్ దాడిలో విద్యార్థుల కాళ్లుచేతులు, వీపు భాగంలో తీవ్రగాయాలవగా తల్లిదండ్రులు గమనించారు. తమ పిల్లలపై స్కూల్ టీచర్ పాశవికంగా దాడిచేయడాన్ని నిరసిస్తూ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే తమ పిల్లలను చితకబాదిన టీచర్ రాజ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కలుగజేసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి అక్కడినుండి పంపించారు.