Feb 19, 2023, 12:16 PM IST
మహబూబాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇవాళ ఉదయమే షర్మిల బసచేసిన పాదయాత్ర క్యాంప్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు షర్మిలను అదపులోకి తీసుకుని తమ వాహనంలో తరలించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిలపై స్థానిక బిఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. అలాగే షర్మిల వ్యాఖ్యలతో జిల్లాలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలుండటంతో పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ నోటీసులు జారీ చేసారు. ఈ క్రమంలోనే షర్మిలను పాదయాత్ర శిబిరం వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోనే హైదరాబాద్ కు తరలిస్తున్నారు. షర్మిల పాదయాత్రను అడ్డుకోవడంపై వైఎస్సార్ తెలంగాణ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.