Jan 10, 2023, 3:49 PM IST
జగిత్యాల : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదాస్పదంగా మారి ఆందోళనలు కొనసాగుతుండగానే మరో పట్టణం మాస్టర్ ప్లాన్ పై ఆందోళనలు మొదలయ్యాయి. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై కూడా స్థానిక రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ మార్చాలంటూ నర్సింగాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల రైతులు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. తాజాగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈ రెండుగ్రామాల రైతుల ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల్లోని పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ రిక్రియేషన్ జోన్లుగా కేటాయించడం పట్ల రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమను కనీసం సంప్రదించకుండానే దాదాపు వెయ్యి ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్దంకావడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని జగిత్యాల రైతులు హెచ్చరిస్తున్నారు.