హైదరాబాద్ : వానొస్తే ‘విశ్వనరకమే’ (వీడియో)

Sep 26, 2019, 11:52 AM IST

మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు హైదరాబాద్ ను ముంచేస్తున్నాయి. వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఎఫ్‌టీఎల్‌ స్థాయిని దాటింది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది.అయితే ప్రస్తుత హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గురువారం ఉదయం సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. 

111ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ఇంత భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.1908లో సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లో 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1908వ సంవత్సరంలో సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో వాన కురవడం ఇదే తొలిసారి.  మంగళవారం కురిసిన వర్షంతో అత్యధికంగా సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో 12.1 సెంటమీటర్ల వర్ష పాతం నమోదవ్వగా... ఉప్పల్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, మోహదీపట్నం, చార్మినార్, కుత్బుల్లాపూర్, అంబర్ పేట, గోషా మహల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మూసాపేట, శేరిలింగంపల్లి,  జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కాగా.. మరో రెండు రోజుల పాటు ఈ వర్షం జోరు కొనసాగే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.